ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను : రెచ్చిపోయిన కోమటిరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ లో చిచ్చు రాజేస్తోంది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రేవంత్ పేరు వెల్లడించగానే పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను గాంధీభవన్ మెట్లెక్కే ప్రసక్తే లేదని సంచలన ప్రకటన చేశారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిపోయిందని ఘాటుగా విమర్శలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలెవ్వరు కూడా తనను కలవొద్దని, కొత్త కార్యవర్గ సభ్యులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని హుకూం జారీ చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ అమ్ముకున్నారని, ఓటుకు నోటులా పీసీసీ పదవిని అమ్ముకున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర కూడా ఉందని, అతి త్వరలోనే దీనికి తగ్గ ఆధారాలు కూడా బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది మాత్రం ప్రజలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎలాంటి విమర్శలు చేయనని కోమటిరెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడి రేసులో వెంకటరెడ్డి కూడా ఉన్నారు. పోటీ రేవంత్, కోమటిరెడ్డి మధ్యే తీవ్రంగా సాగింది. ఒకానొక దశలో కోమటిరెడ్డి పేరు ఫైనల్ అయ్యిందని వార్తలు కూడా వచ్చాయి. చివరికి అధిష్ఠానం రేవంత్ రెడ్డి పేరు ఫైనల్ చేయడంతో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.