ఇప్పటి వరకు ఇలాంటి స్కాం.. ఎక్కడా జరగలేదు
తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల భూములు కాజేయాలని కేసీఆర్ కుటుంబం కుట్ర చేసిందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుల నుంచి భూములు లాక్కోవాలని పథకం ప్రకారమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని విమర్శించారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఎంతో విలువైన భూములు ఉన్నాయి. సామాన్యుల నుంచి వాటిని కాజేయాలని కుట్ర చేశారు. రూ.18 లక్షల కోట్లతో దేశంలో అతిపెద్ద కుంభకోణం చేశారు.
భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి స్కాం ఎక్కడా జరగలేదు. భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి. కేసీఆర్, కేటీఆర్‌కు కలిపి 60 ఎకరాల భూమి మాత్రమే ఉందని 2013లో కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 600 ఎకరాలు ధరణి పోర్టల్ లేవు. ఆ భూములు ఎవరి పేరుమీద ఉన్నాయో తెలియట్లేదు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ధరణి పోర్టల్ అవినీతిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు.













