సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిన్నటి బీజేపీ ఫలితాలు చూసి ఈ రోజు హాస్పిటల్లో పడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు జరగడం లేదన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టే తాము సైలెంట్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిరది తామని, కొత్తగా వచ్చినవారికి పదవులు ఇస్తే, 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవి ఇవ్వాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందన్నారు. లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందన్నారు. అధ్యక్ష పదవి కోసం హైకమాండ్ ముందు నిర్ణయం తీసుకుని, తర్వాత ఏదో అభిప్రాయం తీసుకున్నట్టు యాక్ట్ చేశారన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లయ్య మల్లయ్య అభిప్రాయం తీసుకుని అధ్యక్షుని నియమిస్తారా? అని ప్రశ్నించారు.













