ఆ భయంతోనే ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కాబట్టి బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి అందుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్‌కు భయంపట్టుకుందని, అందుకనే ఆయన ముందుస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ తన అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ను గెలిపించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని పన్నాగాలు పన్నినా, కేసీఆర్ అవినీతి, అక్రమ పాలన ప్రజలకు అర్థమైపోయిందని, కేసీఆర్ మాటలను రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేవని అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, కాబట్టి కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలంతా బీజేపీలో చేరాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్తూ ప్రజలు ఎన్నుకునేది బీజేపీ పార్టీనే అని, తెలంగాణలో త్వరలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.













