కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తామని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గౌరవం ఇవ్వని చోట ఉండలేను. ఎవరి కింద పడితే వారి కింద పని చేయను. తగిన వేదిక ద్వారా సీఎం కేసీఆర్పై పోరాడుతామన్నారు. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తాను. నన్ను నమ్మినవారు నా వెంట రావొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతేడాది జనవరి 1న తిరుమలలో కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరే అవకాశముందని వెల్లడించారు. అప్పట్లో కోమటిరెడ్డికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆ తర్వాత పార్టీ మార్పు అంం మరుగున పడింది. తాజాగా అసెంబ్లీలో జరిగిన ఘటనలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న బీజేపీ నేతలు గట్టి పట్టున్న నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.













