ఖమ్మం జిల్లా వాసికి అంతర్జాతీయ పురస్కారం
ఫొటోగ్రఫీలో ఖమ్మం జిల్లా వాసికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఖమ్మం నగరానికి చెందిన కొలపల్లి శ్రీనివాస్‌కు అమెరికా నిర్వహించిన వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ఆయనకు అరుదైన పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫొటోగ్రఫీ సంస్థ ఇమేజ్ కొలిగ్ సొసైటీ నిర్వహించిన వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో దక్షిణ భారతదేశంలో జరిగే వివాహ వేడుకలపై 2017 సంవత్సరానికి గాను ఎఫ్ఐసీఎస్ అనే గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును భారత దేశ ప్రతినిధులు జులై 1న విజయవాడలో నిర్వహించే కార్యక్రమలో పురస్కారాన్ని అందించనున్నారు. ఖమ్మానికి చెందిన క్లిక్ అండ్ క్లిక్ అధినేత శ్రీనివాస్ గతంలో ఫొటోగ్రఫీలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులను అందుకున్నారు. ఆర్ట్ ఫొటోగ్రఫీలో మక్కువ కలిగిన శ్రీనివాస్ ఖమ్మంలో ఫొటో ఆర్ట్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి ఆ సంస్థకు జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొచ్చారు. ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్పించి నిపుణులుగా రాణించేందుకు కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ పురస్కారానికి ఎన్నికైన క్లిక్ శ్రీనివాస్‌ను ఖమ్మం పట్టణ ఫొటోగ్రాఫర్లు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.













