ఈటలతో భేటీ అయిన కోదండరాం

మాజీమంత్రి ఈటల రాజేందర్ తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఈయనతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్. రెడ్డి కూడా. భేటీ అయ్యారు. ఈటల నివాసంలో వీరందరూ కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు. అయితే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీపై మాజీ ఎంపీ కొండా.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ… ఈటలను ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోందని, ఆయనకు నైతిక మద్దతు ఇవ్వడానికే వచ్చామని తెలిపారు. రాజకీయాలు మాట్లాడుకోలేదన్నారు. ఈటల నిజంగా తప్పే చేస్తే ఇంకా పార్టీలో ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నించారు. పైగా ఇది కోవిడ్ సమయమని, ఈ సమయంలో రాజకీయాలు చేయడమేంటని మండిపడ్డారు. కోవిడ్ విషయంలో తాము సీఎం కేసీఆర్ కు మద్దతిస్తామని, రాజకీయ కొట్లాటలకు సమయం కాదని అన్నారు. ఐక్య వేదిక ఏర్పాటుకు ఇంకా సమయం ఉందని కొండా విశ్వేశ్వరరెడ్డి. అన్నారు.
కేసీఆర్ ఇంటా వంటా లేదు: కోదండరాం ఫైర్…
రాజకీయ విభేదాలు ఉంటే కూర్చోని మాట్లాడుకోవాలని, ఇతరత్రా పద్ధతులు ఉన్నాయని కోదండ రాం అన్నారు. ఇలా పద్ధతులను అవలంబించడం సీఎం కేసీఆర్ ఇంటా వంటా లేదని మండిపడ్డారు. తాను చెప్పినట్లే అందరూ ఉండాలని, తన నీడగానే అందరూ బతకాలని కేసీఆర్ కోరుకుంటారని కోదండ ఫైర్ అయ్యారు. ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని సీఎం ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఈటల కుటుంబీకులు వ్యాపారాలు చేసుకుంటే దెబ్బ తీస్తున్నారని, ఇలా ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరంగా బతికే పరిస్థితి కేసీఆర్ వద్ద ఉండదని కోదండ రాం విమర్శించారు.