హుజూర్నగర్ బరిలో కోదండరాం ?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోటీ చేయించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మహాకూటమిగా బరిలోకి దిగడం, హుజూర్నగర్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలుపొందడం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో హుజూర్‌నగర్‌కు అనివార్యం కానున్న ఉప ఎన్నికల్లో కోదండరాంను పోటీ చేయించే యోచనలో స్థానిక టీజేఎస్ నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తమ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని బరిలోకి దించనుంది. తొలుత ఉత్తమ్ సతీమణి పద్మావతి ఇక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు కాకుండా పార్టీలో మరో నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు, ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారం.













