మార్చి 10న పార్టీ ప్రకటన
కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి దిగిన ప్రొఫెసర్ కోదండరాం త్వరలో ప్రారంభించనున్న తన పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు తదితర వాటిని ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన మార్చి 10న పార్టీ ప్రకటన చేయనున్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించి అశేష జనవాహిని మధ్యలో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. తొలుత ఈ నెలలోనే పార్టీ సంబంధించి ప్రకటన చేయాలని భావించినా మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజును పురస్కరించుకుని ప్రకటన చేస్తే బాగుంటుందని కోదండరాం నిర్ణయించినట్టు తెలుస్తోంది. బహిరంగ సభలో పార్టీ పేరు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ వేదిక ఎక్కడ అనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.













