తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే : కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ది లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద బీజేపీ మహా ధర్మా నిర్వహించింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద ఉండవని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ప్రగతిభవన్‌ను 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో కట్టుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదు. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత నాది. రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నేతలు దోచుకంటున్నారు. దళితబంధు పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయి. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావు. ఎన్నికల ముందు గృహలక్ష్మీ పేరిట మరోసారి కేసీఆర్ గారడీ చేస్తున్నారు అని ఆరోపించారు.













