Kishan Reddy: తెలుగు భాషపై వివక్ష వద్దు…కిషన్ రెడ్డి

రెండోరోజు వైభవంగా సాగిన డబ్ల్యుటీఎఫ్ మహాసభలు
హెచ్‌ఐసీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) 12వ ద్వైవార్షిక మహాసభలు రెండో రోజూ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్వోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించగా.. రెండవరోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన తెలుగువారి అందరికీ శుభాకాంక్షలు. మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని అన్నారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలో మాతృ భాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు.
‘‘వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలి. బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలి. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలి. కొత్త సాంకేతికత, కార్యక్రమాలను మాతృభాషలోనే చేపట్టాలి. వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉంది. 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయి. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలి. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అమలు చేయాలి. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలి. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలి. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటితం చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టి చేయడమే ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముఖ్య ఉద్దేశమని అధ్యక్షురాలు ఇందిరాదత్ అన్నారు. అలా పరిపుష్టి చేసిన వారసత్వ సంపదను నేటి, భావితరాలకు అందించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ మహాసభల్లో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దఎత్తున చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహించారు. సినీ నటులు, విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఈసారి కొత్తగా తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో భాగంగా తెలుగువారి స్టార్టప్ కంపెనీలను సైతం పరిచయం చేశారు.