రాష్ట్రంలో లేని సమస్యను పట్టుకొని కేసీఆర్ ఆందోళన
తెలంగాణలో ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకొని సీఎం కేసీఆర్ ఆందోళన చేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు, మరోసారి వరి వద్దన్నారు. వ్యవసాయంపై సీఎం కేసీఆర్ స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు.
హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్కు నిద్రపట్టని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా హెచ్చరిస్తూనే ఉందన్నారు. ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించాలి. మేము బాయిల్డ్ రైస్ ఇవ్వమని అని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి రాసి ఇచ్చిందన్నారు. కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించాలి. పుత్రవాత్సల్యం కోసం రైతులకు ఆగం చేయొద్దు. బీజేపీపై వ్యతిరేకత పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని అన్నారు.













