కేంద్రం చెప్పింది… తెలంగాణ అంగీకరించింది
ఉప్పుడు బియ్యం సేకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని కేంద్ర మంత్రి కిషన్ తెలిపారు. ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అవవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అయోమయానికి గురి చేస్తూ రాజకీయ లబ్ది కోసం అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానం ఉందని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను ఒప్పించి మెప్పించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని అన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ఉందన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రం, రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తే ప్రయత్నం చేస్తోందని పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.













