అక్కడ సీఎం ఆందోళన చేయవచ్చు.. కానీ ప్రతిపక్షాలు చేయకూడదా?
ధర్నాచౌక్‌లో సీఎం కేసీఆర్ ఆందోళన చేయవచ్చు కానీ ప్రతిపక్షాలు చేయకూడదా? అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా నెలకొన్న పరిస్థితుల వల్ల కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాట్లాడిన ఆయన అనంతరం సంజయ్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన బీజేపీ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని నిలదీశారు. అక్రమ కేసులకు బీజేపీ భయపడదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణిచివేత లేదన్నారు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా? ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదన్నారు. బీజేపీ నేతలను కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. కొవిడ్ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. కొవిడ్ నిబంధనలు బీజేపీ భవనానికి మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.













