తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, కల్వకుంట్ల అవినీతి పాలన యథేచ్చగా సాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని వారసిగూడ కూడలి వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. రాష్ట్రానికి బంగారు తెలంగాణగా మారుస్తానని తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చే అవకాశమే లేదన్నారు. డబ్బుతో రాజకీయం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సికింద్రాబాద్‌లో సరైన రహదారులు, నీళ్లు, నియామకాలు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానిక ప్రజల సమస్యలు టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా తెలుసుకొని వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాటలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు వెన్నదన్నుగా నిలుస్తుందని అన్నారు.













