కేసీఆర్ కు తలనొప్పిగా మారిన ఖమ్మం..!!
తెలంగాణ ఏర్పడినప్పడి నుంచి అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా తిరుగులేని పార్టీగా అవతరించింది. ఉద్యమ పార్టీగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా అది చరిత్రకెక్కింది. ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అందుకే కేసీఆర్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే తెలంగాణ అంతా ఒక ఎత్తయితే ఖమ్మం మాత్రం మరో ఎత్తు. ఆ పార్టీకి మొదటి నుంచి ఖమ్మం పెద్ద సమస్యగా మారింది.
2014లో తెలంగాణ ఆవిర్భవించింది. అప్పటి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అన్ని జిల్లాల్లో తిరుగులేని హవా సాగింది. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కు బోణీ కాలేదు. ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవలేదు. దీంతో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని లాగేసుకుంది బీఆర్ఎస్. అలా పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, తుమ్మల నాగేశ్వర్ తదితరులు. దీంతో 2018లో ఆ పార్టీకి తిరుగుండదనుకున్నారు. అయినా బీఅర్ఎస్ మంత్రం పెద్దగా పని చేయలేదు.
ఇప్పుడు మరోసారి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది. 2018లో సీటు దక్కని పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో జిల్లాలో పట్టున్న నేతలు బీఆర్ఎస్ ను వీడినట్లయింది. వీళ్ల లోటును భర్తీ చేసేందుకు జలగం ఫ్యామిలీపై ఆధారపడింది బీఆర్ఎస్. అయితే ఒక్క జలగం ఫ్యామిలీతో పొంగులేటి, తుమ్మల లేని లేటును తీర్చడం కష్టమేననేది స్థానికుల మాట.
కేసీఆర్ కుటుంబం జలగం ఫ్యామిలీని అక్కున చేర్చుకుని తుమ్మల, పొంగులేటిని పట్టించుకోవడం మానేసిందని ఖమ్మం జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. కేటీఆరే తనను 2018 ఎన్నికల్లో ఓడించారని తుమ్మల తాజాగా ప్రకటించారు. జలగం ఫ్యామిలీ కోసం తనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారని పొంగులేటి ఆరోపించారు. ఇలా అంతర్గత విభేదాల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో బతికి బట్టకట్టలేకపోయింది. బడానేతలంతా బీఆర్ఎస్ లోనే ఉండడంతో ఈసారి ఖమ్మం కైవసం చేసుకుంటుందనుకున్నారు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.













