25న ఖైరతాబాద్ గణపతి తయారీకి కర్రపూజ
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి తయారీలో మొదటి ఘట్టమైన కర్రపూజ ఈ నెల 25న జరగనుంది. ఏటా సర్వేశ ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. 2017లో శ్రీ చండీకుమార అనంత మహా గణపతిగా వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ సారి సప్తముఖ వినాయకుడిగా 57 నుంచి 60 అడుగుల ఎత్తులో గణపతిని తయారు చేసేందుకు నమూనాలను తయారు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు.
25న సాయంత్రం 6:45 గంటలకు కర్రపూజ జరుగుతుందని, అదే రోజు గణపతి నమూనాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నేత మన్నె గోవర్థన్‌రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, వీహెచ్‌పీ నేతలు, ఖైరతాబాద్ బస్తీ పెద్దలు పాల్గొంటారని సుదర్శన్ తెలిపారు.













