ఈసారి ఖైరతాబాద్ గణపతి 27 అడుగులే
ఖైరతాబాద్‌లో ఈసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ ధన్వంతరి అవతారంలో 27 అడుగుల విగ్రహాన్ని రూపొందించనున్నట్లు కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి రాజేంద్రన్ వెల్లడించారు. విగ్రహ నమూనా చిత్రం సిద్దమవుతోందన్నారు. గుజరాత్ నుంచి తెప్పించే మట్టితో విగ్రహం రూపొందించనున్నట్లు వివరించారు. ఆగస్టు 22న వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10 నుంచి విగ్రహం తయారీ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిష్టించిన చోటే సెప్టెంబరు 2న నిమజ్ఞనం ఉంటుందన్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి ఉండదని, ఆన్లైన్ ద్వారానే పూజలు చేస్తామని సృష్టం చేశారు. ఇంకా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు.













