ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్ గణపయ్య
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపు మహాలక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్టా భక్తులకు నేరుగా అనుమతి లేదని నిర్వాహకులు వెల్లడించారు. ఖైరతాబాద్ గణపయ్య తొలిపూజకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దైవజ్ఞశర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.













