త్వరలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం
యాదాద్రిలో త్వరలో మహా సుదర్శనయాగాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఆశ్రమానికి వెళ్లి ఈ యాగం నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. యాదాద్రిలో 100 ఎకరాల యజ్ఞవాటికలో 1,048 యజ్ఞగుండాలతో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. మూడువేల మంది రుత్విక్కులు, మరో మూడు వేల మంది సహాయకులతో ఈ మహాయాగాన్ని వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్‌స్వామి నిర్ణయించారు. భారత్ లోనివే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, బద్రీనాథ్, శ్రీరంగం, పూరి జగన్నాథ్, తిరుపతి లాంటి మహాక్షేత్రాల నుంచి మతాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులను, అన్ని సంప్రదాయాలకు చెందిన మతాల గురువులను ఈ యాగాన్ని ఆహ్వానించనున్నారు.
ఈ యాగానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున్న వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేసే అంశంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్‌స్వామి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చినజీయర్‌స్వామి ఆశీర్వదించారు. శాలువాతో సత్కరించి, రామానుజులవారి విగ్రహాన్ని బహూకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ఎంపీ సంతోష్ కుమార్‌ను కూడా చినజీయర్‌స్వామి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్రావు తదితరులు కూడా ఆశ్రమంలో ఉన్నారు. వారు కూడా చినజీయర్‌స్వామిని కలిశారు.













