ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా?
ఢిల్లీ వేదికగా మహాధర్నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని ఇప్పటికే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుండగా, రిజర్వేషన్ల పెంపు కుదరదంటూ కేంద్రం విస్పష్టంగా తేల్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైతే తానే ఢిల్లీలో మహాధర్నా చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికిపుడు ధర్నాకు పూనుకుంటారా, జాతీయ జెండా ప్రకటించాక ముందుకెళ్ళాలా అన్నదానిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చేస్తేనే, కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేయవచ్చని, జాతీయ కూటమి ఏర్పాటుకు కూడా ఇది ఉత్ప్రేరకమవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.













