ప్రపంచంలోనే తెలంగాణకు మూడో స్థానం : కేసీఆర్
గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్ప కాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. మెదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించిందని అన్నారు. మన దేశంలో అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం అన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు తగ్గిపోయాయి. కరువులు వచ్చాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్ తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్‌లో ఓ పార్టీ పేరు గ్రీన్ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదు. గ్రీనరి పెంచడమే లక్ష్యంగా గ్రీన్ అని పార్టీకి పేరు పెట్టారు అని సీఎం తెలిపారు.













