శ్రీవారిని అదే కోరుకున్నా : కేసీఆర్
తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్‌లో తిరుమలేశుడిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి శోభ, మనవడు హిమాన్షుతో కలిసి వచ్చిన కేసీఆర్ ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం లోకి వెళ్లిన ఆయన ధ్వజస్తంభానికి మొక్కుకుని వెళ్లి మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో కేసీఆర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం పలకగా, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ ఈవో అందజేశారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.













