హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన.. భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్
హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఈ హెరిటేజ్ టవర్‌ను శ్రీకృష్ణ గోసేవా మండలి విరాళాలతో నిర్మించనుంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో నిర్మించనున్న ఈ టవర్ శంకుస్థాపన చేసిన కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మత పిచ్చి అనేది అత్యంత ప్రమాదకరమని, మత మౌఢ్యం ప్రజలను పిచ్చి వాళ్లను చేస్తుందని అన్నారు. దేవుడు, మతం ఎప్పుడూ హింసకు వ్యతిరేకమేనని, మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనుషులు, దేశాలు, ప్రాంతాలు వేరైనా కూడా అందరూ పూజించే పరమాత్ముడు ఒక్కడేనని తెలిపారు. విశ్వశాంతి కోసం అందరూ ప్రార్థనలు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్‌లో హరేకృష్ణ ఆలయ నిర్మాణం జరగడం చాలా సంతోషకరం అని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున రూ. 25 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇస్కాన్ సంస్థ అక్షయ పాత్ర కార్యక్రమం ద్వారా చేస్తున్న అన్నదానం చాలా గొప్ప నిర్ణయని కితాబిచ్చారు. అక్షయ పాత్ర అందిస్తున్న రూ. 5 భోజనాన్ని నగరంలో ధనవంతులు కూడా తింటున్నారని తెలియజేశారు. అక్షయ పాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహించాలంటే ఎంతో చిత్తశుద్ధి కావాలని కొనియాడిన ఆయన.. కరోనా సమయంలో కూడా హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలను అందించిందని గుర్తుచేశారు.













