తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన … సీఎం కేసీఆర్ దూరం!
హైదరాబాద్లో ఈ నెల 8వ తేదీన వందేభారత్ రైలు ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విముఖతతో ఉన్నట్లు సమాచారం. విమానాశ్రయంలో మోదీని కేసీఆర్ రిసీవ్ చేసుకోవడానికి కానీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ప్రోటోకాల్ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ప్రధాని హోదాలో ఎవరున్నా స్థానిక ప్రభుత్వాధినేతగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ఎన్నికల కమిషనర్ లాంటి వీవీఐపీలు రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో సీఎం హోదాలో స్వాగతం పలకడం ఆనవాయితీ, కానీ రాజకీయంగా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ రిసీవ్ చేసుకోవడం లేదని సమాచారం అందింది. ప్రధానమంత్రి కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.













