ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె ఎంపిక హర్షనీయం : మహేశ్ బిగాల
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజవకర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు కుమార్తె, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి ఎంపికయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ కుటుంబానికి ఇచ్చిన ఈ అపురూప గౌరవం ఆ మహనీయుడు శతజయంతి వేళ ఆయనకు అందించే నివాళిగా వ్యాఖ్యానించారు.
విద్యావేత్తగా వాణీదేవి విద్యారంగంలో సుదీర్ఘంగా పనిచేశారు. పట్టభద్రుల సమస్యలపై ఆమెకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పలు యువజన సదస్సుల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అలాగే మాజీ ప్రధాని పీవీ కూతురుగా, విద్యావేత్తగా సమాజంలో గుర్తింపు ఉన్నదని, ఇప్పుడు చట్టసభల ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందన్నారు. ఆ స్థానానికి వాణీదేవి తగిన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.













