తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గంట పాటు చెన్నైలో భేటీ అయ్యారు. తొలి రోజు తిరుచ్చి శ్రీరంగనాథ స్వామి ఆలయ సందర్శనానంతరం చెన్నైలో రాత్రి బస చేశారు. మరుసటి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్వార్ పేటలోని సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, కుమారుడు, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసులు స్వాగతం పలికారు. ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు స్టాలిన్ నివాసంలో గడిపారు. ఈ సందర్భంగా కేసీఆర్, స్టాలిన్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నట్టు సమాచారం. కావేరి-గోదావరి నదుల అనుసంధానం, తెలంగాణ-తమిళనాడు మధ్య సత్సంబంధాలు, తమిళనాట పారిశ్రామిక ప్రగతి తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ సమయంలో ఉదయ నిధి స్టాలిన్‌ను కేసీఆర్ అభినందించి, ఆశీర్వదించారని తెలిసింది.
స్టాలిన్‌కు కేసీఆర్ ఆహ్వానం
యాదాద్రి ఆలయ పున ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు జరిగే వేడుకల్లో ఏదో ఒక రోజు యాదాద్రికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలని కేసీఆర్ కోరారు.













