కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ ?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల వారీగా మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. సర్వే ఫలితాల్లో కామారెడ్డి సెగ్మెంటులో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇక్కడి నుంచి తానే పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టు వివరించాయి. తాను కామారెడ్డిలో పోటీచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా కేసీఆర్ సొంతంగా సర్వే చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్, 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













