సీఎం కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం… మోదీ పర్యటనకు హాజరవుతారా?
తెలంగాణ రాష్ట్రానికి వస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతారా? లేదా న్నది చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రధాని వరంగల్ పర్యటనకు హాజరుకావాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్రం ఆహ్వానం పంపిందని తెలుస్తోంది. మరి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అన్న విషయంలో సీఎం కార్యాలయం ఇంతవరకు ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ అనేక దఫాలు రాష్ట్రానికి వచ్చినా సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రదాని మోదీ హాజరైన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. కనీసం విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం వీడ్కోలు చెప్పడం కూడా జరగలేదు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రారంభానికి ముందు నుంచే కేసీఆర్ ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా బీజేపీపై కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇటీవల కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి స్థానం నుంచి బీజేపీని ఆయన తప్పించారో లేదంటే మోదీ విషయంలో పెద్దగా కేసీఆర్ బాణాలు ఎక్కుపెట్టడం లేదు. పరిస్థితులకు అనుకూలంగా ఆయన కూడా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.













