వరంగల్ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్
గాంధీ ఆస్పత్రి పర్యటన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను కేసీఆర్ పరామర్శించారు. కోవిడ్ వార్డుల్లో తిరుగుతూ, రోగులతో మాట్లాడారు. వారికి ధైర్యం నూరిపోశారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. వైద్య సేవలు, స్థానిక పరిస్థితులు, అవసరాల విషయమై డాక్టర్లతో చర్చించారు. ఎంత ఖర్చైనా సరే, రోగులకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ సమకూర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడెసివిర్ తదితర మందుల లభ్యతపై కూడా వైద్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అయితే గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో మాత్రం సీఎం కేసీఆర్ కేవలం మాస్క్ మాత్రమే ధరించారు. వరంగల్ ఎంజీఎం సందర్శన సమయంలో మాత్రం మాస్కుతో పాటు ఫేస్ షీల్డ్ ధరించారు.













