దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ నిలబడింది : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని, ప్రజలిచ్చిన భరోసాతోనే ముందుకు సాగుతున్నట్లు వివరించారు. తెలంగాణను బంగారు తెలంగాణా తీర్చిదిద్దేంత వరకూ తాను విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఓపిక, దార్శనికతతో ఎన్ని అవాంతరాలు వచ్చినా, సరిదిద్దుకుంటూ వస్తున్నామని, విస్మరించిన రంగాలను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణను సాధించామని, తెలంగాణను దేశం గర్వించే రీతిలో నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
ఉద్యమ సమయంలో ఇచ్చిన నినాదాలను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వస్తున్నామని తెలిపారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు తదితర అంశాలను దీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు వైపు అడుగులు వేస్తున్నామని, ఈ దిశగా అడుగులు వేస్తూ ఆదర్శ రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు రూపమిచ్చి, అమరుల త్యాగాలకు నివాళి అర్పించాలన్న స్ఫూర్తితోనే సర్కార్ పనిచేస్తోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.