ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఫోకస్..! పొంగులేటికి ఝలక్..!!
తెలంగాణలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. పార్టీలు, నేతలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన వాటితో పోల్చితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ అన్ని పార్టీలూ ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ అంతటా సత్తా చాటుతున్నా ఖమ్మం జిల్లా మాత్రం కేసీఆర్ కు ఇంకా పట్టు చిక్కట్లేదు. అందుకే ఈసారి ఆ ఛాన్స్ మిస్ చేసుకోదలచుకోలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు దక్కనీయబోనని శపథం చేశారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. బీఆర్ఎస్ లో తనకు జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఆ పార్టీపై సీరియస్ గా ఎవరు ఫైట్ చేస్తారో ఆలోచించుకునేందుకు చాలా సమయం తీసుకున్నారాయన. చివరకు బీజేపీ కంటే కాంగ్రెస్సే బెటర్ అని భావించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తన అనుచర గణాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ కు పెద్ద సమస్యే ఎదురవుతోంది.
అయితే పొంగులేటిని దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నెలన్నర క్రితం పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావును మళ్లీ కారెక్కించుకున్నారు. ఈయన పొంగులేటి ముఖ్య అనుచరుడు. దీంతో పొంగులేటికి పెద్ద దెబ్బ తగిలినట్లే. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రస్తుత ఎమ్మెల్యే పోడెం వీరయ్యను కాదని.. తనకు భద్రాచలం టికెట్ రాదని తెల్లం వెంకట్రావు భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ టికెట్ ఇస్తామని చెప్పడంతో ఆయన పార్టీ మారిపోయారు. దీంతో పొంగులేటికి చెక్ పెట్టారు కేసీఆర్. ఇలాగే మరికొంతమంది పొంగులేటి అనుచరులను కూడా మళ్లీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం అంతంతమాత్రమే. అందుకే ఈసారి ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్. పొంగులేటి బయటకు వెళ్లి సవాళ్లు చేస్తుండడం కేసీఆర్ లో మరింత పట్టుదల పెరిగేలా చేస్తోంది. అందుకే తుమ్మల నాగేశ్వర రావు లాంటి వాళ్లకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడితే తమ గెలుపు సునాయాసం అవుతుందనే ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. అందుకే ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.













