ఆ 19 మంది ఎమ్మెల్యేలపై కేసీఆర్ సీరియస్.. వార్నింగ్ ఇచ్చేందుకు రెడీ!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. వరుసగా రెండు సార్లు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గులాబీ దళపతి.. ముచ్చటగా మూడోసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నారు. దీని కోసం కసరత్తులు మొదలు పెట్టిన కేసీఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వారిపై ఒక కన్నేశారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ఆయన ఇదివరకే ప్రకటించిన మాట వాస్తవమే. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తమ వ్యాపార విస్తరణపై ఫోకస్ పెట్టి, ప్రజలను పట్టించుకోకుండా ఉన్న కొందరు ఎమ్మెల్యేల వివరాలు కేసీఆర్ వద్దకు చేరాయట. ఈ జాబితాలో 19 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎలక్షన్ల సమయానికి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోకుంటే సీటు మరొకరికి వెళ్తుందని త్వరలోనే కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి? ఎవరికి అంగబలం, అర్థబలం ఉన్నాయి? తదితర అంశాలపై ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో టీఆర్ఎస్ వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం.













