మరొకసారి హామీల విషయంలో ప్లేట్ ఫిరాయించిన రేవంత్ సర్కార్..

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన హామీలలో మరొక హామీని అటకెక్కించింది. ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలో మాట మార్చిన రేవంత్ ప్రభుత్వం.. తాజాగా పంట బోనస్ విషయంలో కూడా సరికొత్త మెలిక పెట్టింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అయిదు గ్యారెంటీలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్యారెంటీలలో రైతు భరోసా పేరుతో ప్రకటించిన గ్యారెంటీలో భాగంగా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయంతో పాటుగా వరి పంటకు మద్దతు ధర..అలాగే బోనస్ కూడా ఇస్తామని ప్రకటించారు. ఒక క్వింటా ధాన్యానికి 500 రూపాయలు బోనసిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం సన్న రకం వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సాధారణంగా 90 శాతం మంది రైతులు రాష్ట్రంలో దొడ్డు వడ్లె పండిస్తారు. సన్న రకాలకు.. ఎక్కువగా పీడా, చీడా బాధలు ఉంటాయి. కాబట్టి వాటి జోలికి పెద్దగా ఎవరు పోరు. తాజాగా రేవంత్ చేసిన ఈ ప్రకటనపై ప్రస్తుతం తెలంగాణలో రైతులు మండిపడుతున్నారు. ఏ పంట వేసినా బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తాను అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ కు రైతుల అవసరం తీరిందని.. ధాన్యం కొనుగోలు కూడా ఆలస్యంగా చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.