కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఫలప్రదం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఇటీవలి ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో చర్చలను, సందేహాలను రేకెత్తించేలా సాగింది. మరోవైపు తన పర్యటన ఫలప్రదమైందని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్రం తగు విధంగా స్పందించడంతోపాటు రాష్ట్రానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని చెప్పినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకబిగిన తొమ్మిదిరోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మకాం వేయడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు నితిన్ గడ్కరీ ఇతర మంత్రులను కేసీఆర్ కలుసుకున్నారు. మంత్రులను కలుసుకున్న తరువాత వచ్చిన ప్రకటనల కన్నా కేసీఆర్ ఏకాంతంగా ప్రధాని మోదీతో, ఇతరులతో భేటీ అవడమే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. మొత్తం మీద ఢిల్లీతో సత్సంబంధాలను కేసీఆర్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ పర్యటన ఫలప్రదమైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏమి జరిగింది? ఇది ప్రభుత్వపరమైన కలయికేనా? వీటికి రాజకీయాలతో సంబంధం ఉందా? అన్న అంశాలపై ఎవరికి వారు తమదైన శైలిలో ఊహగానాలు చేశారు. ఎన్నికల రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన అంతుచిక్కవని, ఏ అడుగువేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఎన్నికను వాయిదా వేయడం యాధృచ్చికంగా జరిగినా ఆయనే ఈ ఎన్నికను వాయిదా వేయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించి సంచలనం సృష్టించారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దీనిపై విమర్శలు, ఆరోపణలు చేశారు. ఢిల్లీ టూర్‌ను ఇటు రాజకీయంగా అటు పాలనాపరంగా సీఎం కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారని, తాజా పర్యటన వల్ల రాష్ట్రంతో పాటు హుజూరాబాద్‌లోనూ తమకు మేలు జరిగిందని పార్టీ ముఖ్యనేతలు విశ్లేషిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తొమ్మిది రోజులపాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా సీనియర్ కార్యకర్తలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీ మయమయ్యాయి. జై తెలంగాణ జైహింద్ నినాదాలతో పార్టీ శ్రేణులు శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలో దాదాపు 50 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానికి సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు. వీటిల్లో తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ క్యాడర్‌పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్టైల్ పార్కు ఏర్పాటు, హైదరాబాద్`నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు ప్రధానమంత్రి గ్రామీణ సడయ్ యోజనకు అదనపు నిధులు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం తదితర అంశాలున్నాయి. అంతేకాకుండా కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన ప్రధాని సానుకూల దృక్పథంతో స్పందించారు. ఈ భేటీ సందర్భంగా యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ చేసిన ఆహ్వానానికి ప్రధాని ఒప్పుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. అందుకు సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దాంతో పోలీస్ శాఖలోనూ మార్పులు జరిగాయని వివరించారు. పోలీస్ శాఖలో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 108కు పెరిగిం దని, ఐపీఎస్ కేడర్ పోస్టుల సంక్య కూడా 139 నుంచి 195కు పెరిగిందని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హోంశాఖ మంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం, హైదరాబాద్` విజయవాడ
65వ నంబర్ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడం, హైదరాబాద్-కల్వకుర్తి మధ్యలో 765 హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, పెండిరగ్ సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేయడం, హైదరాబాద్ దక్షిణ ప్రాంత ఎక్స్‌ప్రెస్ వేను మంజూరు చేయడంపై చర్చించారు. ఈ ఐదు అంశాలకు సంబంధించి వినతి పత్రాలను సమర్పిం చారు. సీఎం కేసీఆర్ చర్చించిన అంశాలను వాదానలను సానుకూలంగా విన్న జల్‌శక్తి శాఖ మంత్రి విషయం అర్థం చేసుకున్నారు. కేంద్ర మంత్రితో సాగిన చర్చ సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పాలనాపరమైన సమస్యలకు పరిష్కారం సాధించేందుకు ప్రదాని, కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 9న తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.













