బీజేపీలోకి కేసీఆర్ అన్న కూతురు?
తెలంగాణలో రాజకీయంగా పట్టు చాటుకునేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీలోని పలు సీనియర్ నేతలకు కమలనాథులు గాలం చేశారు. పేరున్న నేతలను బీజేపీలోకి తీసుకునేందుకు పావులు కదిపారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొనేరితిలో చేరికలు ఉండేలా కమలనాథులు వ్యూహం రచించినట్లు చెప్తున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు టీడీపీ, కాంగ్రెస్ నుంచి అసంతృప్తి నేతలపై తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించే ఆయన అన్న కూతురు రమ్యను బీజేపీలోకి చేర్చుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న రమ్య ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న రోజున పార్టీ మారబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా బీజేపీ వలసలను ప్రోత్సహిస్తోంది.













