తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ
కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రీశైలం, ద్రాక్షారామం తదితర శైవక్షేత్రాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఉమామల్లేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం శివాలయాల్లో కార్తిక శోభ సంతరించుకుంది. శివాలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేశారు. హైదరాబాద్లోని గుంట మల్లేశ్వర్వస్వామి ఆలయం, సుబ్బులవారితోట శివాలయం, రోటరీనగర్ రాజరాజేశ్వరి ఆలయంలో మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్తిక దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు.
మొదటి కార్తిక సోమవారం పురస్కరించుకొని భద్రాచలం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం గోదావరి నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు. మహిళలు, పురుషులు చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ పుణ్యస్నానాలు ఆచరిస్తూ కార్తిక దామోదరుడ్ని కొలుస్తున్నారు. అనంతరం గోదావరి నది ఒడ్డున ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.













