చేవెళ్ల బరిలో కార్తీక్ రెడ్డి !
మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకొని నేడు ముఖ్యమంత్రిని ప్రగతిభవన్‌లో కలువనున్నారు. కార్తీక్‌రెడ్డి కూడా ఆమెతో బాటు ఉంటారు. ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా తన తనయునికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆమె కేటీఆర్ వద్ద ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి వద్ద భేటీలో చర్చకు రానుంది. ఇటీవల రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, రెండేళ్లుగా అనేక అవమానాలకు గురి చేసినా భరించామని సబితా రెండ్రోజులుగా నియోజకవర్గ శ్రేణులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో అనుచరులకు వివరించారు. పార్టీ మారడాన్ని కొందరు కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకించినా అత్యధికులు మాత్రం అంగీకరించినట్లు తెలిసింది.













