సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్ చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. మరోవైపు ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరుకావడంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.













