అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న : కడియం
అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శంచారు. హైదరాబాద్ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.4వేల నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిండు సభలో నిరుద్యోగభృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారు. పంట రుణాలు తీసుకొని వాళ్లు బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.













