హైకోర్టు సీజేగా హిమ కోహ్లీ?
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఆయన వెస్ట్‌బెంగాల్ హైకోర్టుకు బదిలీకావడంతో గత ఏడాది జూన్‌లో జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ సీజేగా వచ్చారు. తాజాగా మరోసారి బదిలీలతో కొత్త సీజే రానున్నారు. తెలంగాణలో పాటు మరికొన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర హైకోర్టు సీజే ఆర్ఎస్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రికమెండ్ చేసినట్టు తెలిసింది.
సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ సీనియర్లు అయిన ఐదుగురు జడ్జీల కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ఈ సిఫార్సులు చేసింది. కేంద్ర న్యాయ శాఖ ఈ ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి సంతకం తర్వాత బదిలీలపై నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇందుకు ఒకట్రెండు వారాలు టైం పడుతుందని అంచనా వేస్తున్నారు.













