మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఆవిష్కరణ
ఖమ్మం నగరాన్ని మరో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా మాజీ అధ్యక్షుడు జయ్ తాళ్ళూరితో పాటు పలువురు దాతలు ఇచ్చిన విరాళంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయన మనవడు, గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. పండుగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ ఒక్కసారైన ఆ మహానియుడి విగ్రహాన్ని చూసి తరించేలా విగ్రహం రూపకల్పన చేశామన్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో తీర్చిదిద్దిన విగ్రహం తయారీ ఇప్పటికే పూర్తి అయిందని పేర్కొన్నారు.













