టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు : జేపీ నడ్డా
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని అన్నారు. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకోవాలని చూశారు. సభకు ఒక రోజు ముందు అనుమతి రద్దు చేయించారు. అయినా హైకోర్టును ఆశ్రయించి సభకు అనుతి పొందాం. తెలంగాణలో కేసీఆర్ ఒక నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కూడా కేసీఆర్ వంటి ఆంక్షలే విధించారు అని అన్నారు.
జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,500 కోట్లు కేటాయించాం. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు. ఇన్ని రోజులు గడుస్తున్నా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంగా మార్చుకుంది. రూ.40 వేల కోట్ల ఈ ప్రాజెక్టు రూ.లక్షా 40 వేల కోట్లకు పెంచారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోందన్నారు. కేసీఆర్ అవినీతి చూస్తే ఆవేదన కలుగుతుంది. కాకినాడ తీర్మానం ద్వారా అందరికంటే ముందు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది బీజేపీ మాత్రమే. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలంది అని అన్నారు.













