నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు..
నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు జానారెడ్డి అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన ఠాగూర్ ఎన్నికకు కొన్ని వారాలే సమయం ఉన్నందున అప్పటిదాకా పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నిలిపివేయాలని అధినాయకత్వం నిర్ణయించిందన్నారు. జానారెడ్డి అభ్యర్థనపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఐసీసీ కార్యదర్శులతో చర్చించింది పార్టీ నాయకత్వం. అందరూ జానా అభిప్రాయంతో ఏకీభవించటంతో.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రకియను బై ఎలక్షన్ పూర్తయ్యేదాకా హోల్డ్‌లో పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. కొత్త అధ్యక్షుడి ఎన్నికదాక పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో పాత కమిటీనే పార్టీ బాధ్యతలు చూస్తుందన్నారు మాణిక్కం ఠాగూర్. సాగర్ ఎన్నికల తర్వాత 2023 సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందన్నారు.













