భారత్ టాప్ టెన్ లో జమ్మికుంట పోలీస్ స్టేషన్
భారత్లో మెరుగైన ప్రతిభతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లలో జాబితాలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ టాప్10లో నిలిచింది. 2020 ఏడాదికి సంబంధించిన ఈ జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ప్రతి ఏడాది కేంద్ర హోం శాఖ ఈ జాబితాను విడుదల చేస్తుంది. అన్ని విభాగాల్లో పోలీస్ స్టేషన్ల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. పోలీస్ స్టేషన్లకు ప్రతి ఏడాది ర్యాంకులు ఇవ్వాలని 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు విడుదల చేస్తోంది. దేశంలోని 16,671 పోలీసు స్టేషన్ల పనితీరుని పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. చివరకు ప్రతి రాష్ట్రం నుంచి ఒకటి లేదా రెండు పోలీసు స్టేషన్లు జాబితాలో నిలుస్తాయి. వాటిల్లో టాప్10 పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేస్తారు.













