అన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసిన జలగం సుధీర్

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మొదటి రోజే పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశాన్ని తొలిసారిగా భారత ఎన్నికల సంఘం కల్పించింది. కోదాడ నియోజక వర్గానికి చెందిన జలగం సుధీర్ అన్‌లైన్ ద్వారా తన నామినేషన్ దాఖలు చేశారు. అన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు అందచేయటానికి సిద్దంగా ఉన్నానని, ఈ ఆన్‌లైన్ ప్రాసెస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాలని జలగం సుధీర్ కోదాడ ఎన్నికల అధికారులు లేఖ రాశారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో సువిధ పోర్టల్ ద్వారా కోదాడ అసెంబ్లి నియోజకవర్గం నుండి ఆన్‌లైన్ ద్వారా స్వతంత్ర అభ్యర్దిగా జలగం సుధీర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ఎన్నికల అధికారులు ఆమోదిస్తే.. తెలంగాణలో మొట్ట మొదటి ఆన్‌లైన్ నామినేషన్ కోదాడ నుండే దాఖలు అయినట్లుగా భావించవచ్చు.