ముగిసిన జైపాల్ రెడ్డి అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛనలతో పూర్తి చేశారు. జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైపాల్‌ను కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ జైపాల్ రెడ్డి పాడె మోశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, రమేశ్ కుమార్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు, నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్‌కుమార్, సీతక్క, గూడూరు నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కేకే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, డి.శ్రీనివాస్, బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.













