అనుమతిస్తే ఆయనకు భారీ సన్మానం చేస్తా ..

సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే ఆయనకు భారీ సన్మానం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం చేసిన ఉద్యమ ఫలితంగానే నేడు నా నియోజకవర్గ ప్రజల కల సాకారం అయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. సంగారెడ్డి కాలేజీకి మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయండి. రూ.వెయ్యి కోట్లు కేటాయించండి. మీరు శంకుస్థాపనకు వచ్చిన రోజు మీ అనుమతితో భారీ సన్మానం చేస్తా. ఇది నా వ్యక్తిగతం. పార్టీతో సంబంధం లేదు అని అన్నారు..
ఎమ్మెల్యేగా తనకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్‍కు ఇప్పుడు మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో గెలిచిన తర్వాత ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినా సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం అడిగానని, అసెంబ్లీలో సీఎం మాట ఇచ్చారని, తన కుమార్తె జయారెడ్డితో కలిసి ట్యాంక్‍బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానని ఆయన గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సంగారెడ్డికి ఐఐటీ వచ్చిందన్నారు.