జనవరి 1న నుమాయిష్ ప్రారంభం
ప్రతిష్ఠాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు నియమితులయ్యారు. గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవలే రాజీనామా చేసిన నేపథ్యంలో సొసైటీ మేనేజింగ్ కమిటీ సర్వసభ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హనుమంతరావు, మాజీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం, మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ మంత్రిని సన్మానించారు. జనవరి 1వ తేదీ 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభమవుతుందని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.













