త్వరలో ఐటీ హబ్ ప్రారంభిస్తాం : ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత వెల్లడించారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ హబ్ లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ద తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయి. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని తెలిపారు.













